Unknown Unknown Author
Title: How to do Deeparadhana | దేవునికి దీపం ఎలా పెట్టాలి | ధర్మ సందేహాలు
Author: Unknown
Rating 5 of 5 Des:
How to do Deeparadhana | దేవునికి దీపం ఎలా పెట్టాలి | ధర్మ సందేహాలు దీపం జ్యోతి పరబ్రహ్మమ్ దీపం జ్యోతి పరాయణమ్ దీపేన హారతే పాపమ్ దీ...
How to do Deeparadhana | దేవునికి దీపం ఎలా పెట్టాలి | ధర్మ సందేహాలు


దీపం జ్యోతి పరబ్రహ్మమ్ దీపం జ్యోతి పరాయణమ్
దీపేన హారతే పాపమ్ దీప దేవి నమోనమః

ఇక్కడ మనం దీపం పెట్టే ఆంతర్యం తెలుసుకుందాం. దీపం లేని ఇల్లు ప్రాణం లేని శరీరం వంటిదే. మామూలుగా ప్రమిద అనేది మట్టితో చేసినదై ఉంటుంది. మన శరీరం పంచభూతాలతో తయారైంది. దీపపు ప్రమిద శరీరానికి ప్రతీక. దానిలోని నూనె లేక నెయ్యి మనలోని ప్రేమ వంటిది. ప్రేమను, స్నేహాన్ని జిడ్డుతో పోల్చి చెబుతుంటారు. ప్రేమ స్నేహితుల మధ్య ఉంటే అది స్నేహం, అదే తోటి సోదరుల యందు ఉంటే అది ఆదరం, అదే పెద్దల యందు ఉంటే గౌరవం. అది భగవంతుని యందు ఉంటే దాన్ని భక్తి అంటారు. అయితే ఈ ప్రేమ భగవంతుని కోసం ప్రకాశించ గలిగితే మన జన్మ ధన్యం. అలా ప్రకాశింపచేయాలంటే మనకు శాస్త్రముల తోడు కావాలి. శాస్త్రములకు గుర్తు మనం పెట్టే వత్తులు. ఒక వత్తి మాత్రమే వేసి వెలిగించకూడదు. రెండు వత్తులు కలిపి వెలిగించాలి. రెండు దీపాలు వెలిగించాలి. కొందరు ఒకే దీపం వెలిగిస్తారు, వారు ఒకే ప్రమిదలో రెండు దీపాలు వెలిగించాలి. ఒక వత్తు వేదాన్ని, రెండో వత్తు ఆ వేదాలను వివరించే వ్యాఖ్యాణ గ్రంథములు. వ్యాఖ్యాణ గ్రంథములు అంటే రామాయణ, మహాభారతం, ప్రబంధాలు మొదలైనవి. ధర్మ శాస్త్రములు, ఇతిహాసాలు, పురాణాలు, ఆగమాలు మరియూ ప్రబంధాలు ఇవన్నీ కలిపి వ్యాఖ్యాణ గ్రంథములు అని అంటారు. ఇవి వేదంలోని అర్థాలని మరింత స్పష్టంగా కనిపించేట్టు చేస్తాయి. కనుక మనకు వేదమూ అవసరమే, వ్యాఖ్యాణ గ్రంథములు అవసరమే.

ఆ రెండు వత్తులు దేవుడి వైపు తిరిగి ఉండాలి. అందులో వెలిగే నిప్పే మనలోని జ్ఞానం. నేను అని చెప్పే ఆత్మకు స్వరూపం అణుమాత్రం, జ్ఞానమే తన స్వభావం. జ్ఞానమే ఆత్మ స్వరూపం. ఆ జ్ఞానం వికసించగలగాలి. అప్పుడు ఎదురుగుండా ఉండే రూపం మనకు చక్కగా దర్శనం ఇస్తుంది. వెలిగే జ్యోతి ప్రమిద అంచు వద్ద ఉండాలి. దీపం మధ్యలో జ్యోతి వచ్చేట్టు వెలిగించడం పద్దతి కాదు. అట్లాచేస్తే ప్రమిద అంచు యొక్క నీడ దేవుడిపై పడుతుంది. దీప కాంతి దేవుడిపై పడాలి, అప్పుడు స్పష్టంగా దర్శించవచ్చు.
భూమి, జలం మరియూ తేజస్సు ఈ మూడు ద్రవ్యాలను వాడి భగవంతుడు విశ్వరచన చేసాడు. ఇక్కడ మనం ఈ మూడు ద్రవ్యాలు దీపంలో చూడవచ్చు. భూమికి సూచకంగా ప్రమిద, జలానికి సూచకంగా నెయ్యి మరియూ తేజస్సుకి సూచకంగా జ్యోతి. ఈ మూడింటిని భగవన్మయం చేయగలగాలి. కేవలం బయటకి కనిపించే వస్తువులే కాదు, భగవంతుడు ఇచ్చినవి మనలో ఎన్నో ఉన్నాయి. మన మనస్సుని పాత్రను చేసి, మన ప్రేమనే నెయ్యిగా పోసి, మనం భగవంతుని కొరకు చేసే చింతనలే వత్తులు, ఆపై మన జ్ఞానమే జ్యోతి అని భావించాలి. అంటే లోపల బయట కనిపించని వస్తువులన్నీ పరమాత్మమయం చేయడమే దీపం పెట్టే ఆంతర్యం.

దేవుడి విగ్రహానికి లేదా పటానికి ధూపధీప నైవేద్యాలు సమర్పించటం మన ఆరాధనా పద్ధతి. ఉదయము వెలిగించు దీపము కన్నా ప్రదోష కాలమందు వెలిగించు దీపం అత్యంత మంగళకరమైనది. పూజలో అత్యంత ముఖ్యమైన దీపం ఆ తర్వాత ధూపం, పుష్పాలు, పసుపు కుంకుమలు, గంధచందన విభూతులు, కొబ్బరికాయ, అరటిపండ్లు, వక్క, తమలపాకులు, మంగళ హారతి మొదలగునవి క్రమానుగతిలో ప్రాధాన్యము కలిగినటువంటివి. కావున పూజ చేయువారిపై వీటి అనుకూల శక్తి, ప్రభావము వెంటనే పడుతుంది. అష్టోత్తరములు మరియు శ్లోకములు మనలో దాగి ఉన్న దైవీశక్తులను మేల్కొలిపి మనకు మానసిక, శారీరక శుభాలను కలిగిస్తాయి. ఇలా మనం దేవుడిని ప్రసన్నము చేసుకొని అతని దీవెనలను పొందునట్లు చేయునదే కాక పూజకై మనము చేయు క్రియలన్నియూ మనకు శుభమును చేకూర్చును.

దీపమును నేలపై ఏమీ వేయకుండా సరాసరి నేలపై పెట్టి వెలిగించరాదు. అరటి ఆకును గానీ, తమలపాకును గానీ, పళ్లెమును కానీ, నీటితో శుభ్రం చేసి, ముగ్గువేసిన నేలపై ఉంచి దీపం కుంది పెట్టాలి. ఇక ఇంటియందు దేవతారాధనకై మనమొక ప్రత్యేక స్థానమును ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. ఆ స్థానం నేలకు కాస్త పై భాగంలో ఉండునట్లు చూసుకొనవలెను. నేలను తాకునట్లు పూజా ద్రవ్యములు మరియు పవిత్ర గ్రంధములు ఉంచరాదు. 

దీపములోని చమురుకై ఆవునెయ్యిని కాని నల్ల నువ్వుల నూనెను వాడుట శ్రేష్టము. ఎట్టి పరిస్థితిలోనూ గేదె నెయ్యితో దీపారాధన చెయ్యరాదు. ఉదయము పూజ చేయునపుడు దీపము యొక్క ముఖము తూర్పు దిక్కుగా ఉంచవలెను. సాయంత్రం పూజలో ఒక వత్తి తూర్పుదిక్కుగా మరొకటి పడమర దిక్కుగా ఉంచి దీపము వెలిగించవలెను. మూడు వత్తులను వాడినచో తూర్పు, పడమర మరియు ఉత్తరము దిక్కుగా వెలిగించాలి. ఇక ఐదు వత్తులను వెలిగించదలచిన తూర్పు, పడమర, ఉత్తర, దక్షిణ మరియు ఈశాన్య దిక్కుగా వత్తులు ఉంచి వెలిగించాలి. 

ఇలా వెలిగించిన దీపాన్ని ఆర్పేయాల్సి వస్తే నోటితో ఊదరాదు. వత్తిని చమురులోకి జార్చినచో అది ఆరిపొతుంది (లేదా) వెలుగుతున్న వత్తిపై కొద్దిగా నూనె పోస్తే ఆరిపోతుంది. 

దీపారాధన సమయంలో చదవవలసిన శ్లోకం.
దీపం జ్యోతి పరబ్రహ్మమ్
దీపం సర్వతమోపహం
దీపేన సాధ్యతే సర్వం
సంధ్యాదీపం నమోస్తుతే!

Advertisement

Post a Comment

 
Top